తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట

Share this:

  • రాజకీయ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే
  • ప్రపంచవ్యాప్తంగా పరిశీలించి మహిళల కోసం షీ టీమ్స్ ఏర్పాటు
  • చైర్పర్సన్ అన్నపూర్ణ అను నిత్యం అభివృద్ధికి కృషి చేస్తున్నారు

సూర్యాపేట(V3News): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలకు నేనున్నానంటూ అండగా ఉంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు నిర్వహించనున్న మహిళా బందు కార్యక్రమాన్ని ఆదివారం పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న 9వ వార్డులో ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మీ వెంట మేమున్నాం అంటూ మహిళలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాఖీలు కట్టి తమ కృతజ్ఞతలు తెలిపేందుకు రావడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గుండెమీద చెయ్యివేసి ఆలోచించుకుంటే తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశాడో అర్థం అవుతుందన్నారు. గత ప్రభుత్వాలు మహిళలు ఒంటరిగా వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పోకిరీ గాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు ప్రపంచ దేశాల్లో తీసుకుంటున్న చర్యలను చర్చించి ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళల రక్షణకు ప్రత్యేకంగా షీ టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు మహిళలు నిర్భయంగా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నారు అంటే అది కెసిఆర్ పుణ్యమే అన్నారు . ఆర్థిక స్వావలంబనతో మహిళలు అభివృద్ధి చెందాలని అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం ముందుగా మహిళలకు అందేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అందులో భాగంగానే కల్యాణలక్ష్మి చెక్కులను సైతం ఆడబిడ్డ తల్లులకు ఇచ్చేలా ప్రణాళిక చేశారన్నారు. మహిళలు చదువుతో ఏదైనా సాధించవచ్చని మహిళల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. కేవలం కరెంట్ పోల్ మెన్ లు పురుషులు మాత్రమే పని చేస్తుండగా ప్రస్తుతం 230మంది మహిళ లైన్మెన్లను ఉద్యోగంలోకి తీసుకున్నామని వారు చక్కగా పొళ్లు ఎక్కుతున్నారని అన్నారు. మహిళలను రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలు మున్సిపల్ చైర్మన్ లు, మార్కెట్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు గా ఉన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల్లో ఆడవారికి పదవి ఉన్నప్పటికీ మగవారే పెత్తనం ఉండేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అలాంటిది కనపడదన్నారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్‌గా అన్నపూర్ణ పొద్దంతా పనిచేస్తూ విరామం లేకుండా తిరుగుతూ వార్డుల్లో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడంలో ముందుకు వెళుతుందన్నారు. కరోన సమయంలో అలుపెరగక సేవలందించిన వివిధ శాఖల మహిళా ఉద్యోగుల సేవలను కొనియాడారు. మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో నిరాదరణకు గురైన బడుగు బలహీనవర్గాల కాలనీలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో ఎంతో అభివృద్ధి చేసుకుందామన్నారు. ఒక మహిళగా అన్ని బాధ్యతలు నిర్వర్తించడమే తనకు తెలుసని అలాంటి నేను ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో కౌన్సిలర్‌గా బరిలో నిలిచి గెలిచానన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన తనకు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసే మున్సిపల్ చైర్మన్‌గా అవకాశం కల్పించడం నిజంగా నా అదృష్టం అన్నారు. నా కన్నీళ్లతో కాళ్లు కడిగిన మంత్రి జగదీష్‌రెడ్డి రుణం తీర్చుకోలేనని అన్నారు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్‌గా మంత్రి జగదీశ్‌రెడ్డి నాపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటానన్నారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పారిశుధ్య, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థిరపడ్డ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్ , మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply