దళిత బందు పథకాన్ని జిల్లా అంతటా అమలు చేయాలి కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్…

Share this:

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత బందు పథకాన్ని సూర్యాపేట జిల్లా లోని దళితులందరికి వర్తింపజేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు దళిత బంధు పథకాన్ని జిల్లా అంతట అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ నియమించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు KVPS ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దళిత బంధు పథకం సూర్యాపేట జిల్లా లోని ఒక మండలానికే పరిమితం చేయకుండా జిల్లాలోని అన్ని మండలాల్లోని దళిత కుటుంబాలకు వర్తింప చేయాలని అన్నారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలను,వారికి ఎదురవుతున్న కుల వివక్ష ఘటనలను విన్నవించుకోవడం ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చైర్మన్ లేకపోవడంతో తల లేని మొండెం తయారైందన్నారు. వెంటనే ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిషన్ కు చైర్మన్ నియమించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రుణాలు మంజూరు చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ పైరవిలకు తావు లేకుండా అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు.అదేవిధంగా కులాంతర వివాహం చేసుకుని ప్రభుత్వ ప్రోత్సాహం కోసం దరఖాస్తులు పెట్టుకొన్న వారికి ప్రభుత్వం అందించే డబ్బులు ఇవ్వకపోవడంతో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని అన్నారు.కులాంతర వివాహం చేసుకున్న జంటలు ఇచ్చే ప్రోత్సాహక డబ్బులను వెంటనే విడుదల చేయాలని జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా గ్రామాలలో కుల వివక్షత అంటరానితనం ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. దళిత మహిళలను బతుకమ్మ అడనివ్వకపోవడం,దుర్గామాత ఉత్సవాలను వీక్షించ కుండా చేయడం, జమ్మి చెట్టు వద్ద పూజ చేయకుండా అడ్డుకోవడం లాంటి ఘటనలు జిల్లాలో అక్కడక్కడ జరిగాయని అవి పోలీస్ అధికారుల దృష్టికి వెళ్ళినా వాటిని రాజీ పడే విధంగా ప్రేరేపించారని పేర్కొన్నారు.పండగల సందర్భంగా కుల వివక్షత, అంటరానితనం పాటిస్తున్న వారి పట్ల పోలీస్ మరియు ఇతర ప్రభుత్వ అధికారులు ఉదాసీనంగా ఉండవద్దని అన్నారు. ఖాళీగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఏళ్లతరబడి ప్రభుత్వ, బంజారాయి,పోరంబోకు భూములను సాగు చేసుకుని జీవిస్తున్న దళితులకు పట్టాలు ఇవ్వకుండా రెవిన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.దళితుల భూ సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించాలని అన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ అధికారుల దృష్టికి వస్తే వాటిని పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలన్నారు. లేనియెడల దళితులను సమీకరించి ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ ధర్నాలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బొడ్డుపల్లి వెంకటరమణ కెవిపిఎస్ జిల్లా నాయకులు జె.నరసింహారావు, చినపంగి నరసయ్య, బాలెంల శ్రీను,రత్నం, సోమపంగు సాయి తేజ,కోట గోపి,నందిపాటి వెంకటేష్,ములకలపల్లి సైదులు,నవీన్,శ్రీధర్,శ్రీహరి,రుత్విక్,శ్రీకాంత్,ఉదయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply