బ్లైండ్ స్కేటింగ్‌లో విద్యార్థి వజ్ర రికార్డు
Share this:
నగరి (V3News) 23-04-2022:నంగిలి ప్లాజా నుంచి నగరి వరకు 160 కిలోమీటర్ల మేర కళ్లకు గంతలు కట్టుకొని స్కేటింగ్ చేసి పుత్తూరు పట్టణానికి చెందిన కృష్ణకుమార్, లీలావతిల కుమారుడు కె.భారతి రాజ (9) సరికొత్త వజ్ర రికార్డు సృష్టించాడు. శుక్రవారం ఉదయం 6.10 గంటలకు నంగిలి నుంచి బయలుదేరిన భారతిరాజా రాత్రి 10 గంటలకు నగరిలో పర్యాటకశాఖ మంత్రి ఆర్కేరోజా నివాసం వద్దకు చేరుకున్నాడు. మంత్రి భారతిరాజా గంతలు విప్పి స్కేటింగ్‌ను ముగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 160 కిలోమీటర్లు చూడకుండా స్కేటింగ్ చేయడం షాకింగ్‌గా ఉందన్నారు. 4వ తరగతి చదివే ఒక విద్యార్థి ఎండను సైతం లెక్కచేయకుండా ఇంత రికార్డు చేయడం గొప్పవిషయం అన్నారు. పిట్ట కొంచం కూత ఘనం అంటూ పుత్తూరు పట్టణానికి చెందిన పిల్లలు నియోజకవర్గాన్ని చరిత్ర పుటల్లోకి ఎక్కిస్తున్నారన్నారు. తాను ఎప్పుడూ క్రీడలకు సహకారం అందిస్తూ ఉంటానని అందులో భాగంగానే తనకు క్రీడాశాఖ వచ్చిందని తలస్తున్నానన్నారు. విద్యార్థి తండ్రి పెయింటర్ అని చాలా పేదకుటుంబమని ఆ కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి రికార్డు సృష్ఠించిన విద్యార్థికి తన తరపున రూ. లక్ష నజరానా ప్రకటిస్తున్నానన్నారు. అతని ఖాతాకు సొమ్మును జమచేస్తానన్నారు. విద్యార్థికి ఆశీస్సులు అందజేశారు. కోచ్ ప్రతాప్‌ను ప్రశంసించారు. అనంతరం యాత్ర ముగింపు కేక్‌ను కత్తిరించి అందరికీ పంచారు. ఆమె వెంట సోదరుడు రామ్‌ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.


