గోదావరిలోకి మహారాష్ట్ర మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలు

Share this:

బాసర: జీవనది గోదావరి గరళాన్ని మింగుతోంది. మహారాష్ట్ర మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలు బాసర దగ్గర గోదావరిలో కలుస్తున్నాయి.దీంతో పూర్తిగా గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. ఏటా వరదల్లోకి మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలను వదులుతున్నారు. గోదావరి నది కలుషితం కావడంతో బాసర పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పరివాహక పట్టణాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, మలినాలు గోదావరిలో కలుస్తున్నాయి.నదీ పరివాహాక ప్రాంతంలో పరిశ్రమలు,పట్టణాలు, గ్రామాల నుంచి వస్తున్న వ్యర్థాలు,మలినాలు పూర్తిస్థాయిలో శుద్ధి చేయకపోవడంతో గోదావరి నది తన పవిత్రతను కోల్పోతోంది.
ఇప్పటికే ఈ నదీ జలాలలో స్నానం చేసేవారితో పాటు, తాగునీటికి ఉపయోగించడం వల్ల వివిధ రకాల వ్యాధులు, రోగాలు వస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలను నదిలో పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండా కలుపుతుండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విషతుల్యంగా మారుతున్న గోదావరి
గోదారమ్మకు ప్రమాదం పొంచి ఉంది. ఉత్తర తెలంగాణకు ప్రాణదాతగా ఉన్న ఈ గోదావరి నదికి పయినీర్‌ ఆల్కహాల్‌ ఫ్యాక్టరీ ద్వారా ప్రమాదం పొంచి ఉంది. నదిపై సుమారు 150 గ్రామాల ప్రజలు ఈ నీటిని తాగుతున్నారు. బాసర నుంచి ఎగువ భాగాన ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలోని ధర్మబాద్‌ తాలుకాలోని బాలాపూర్‌ శివారులో ఉన్న ఆల్కహాల్‌ ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయన వ్యర్థ పదార్థాలు కొన్ని సంవత్సరాలుగా గోదావరిలో కలుస్తున్నాయి.బాసర ట్రిపుల్‌ఐటీలోనే సుమారు 8వేల మందికి తాగునీటికి గోదావరి ఆధారంగా ఉంది.ఇక బాసరకు నిత్యం వచ్చే యాత్రికుల సంఖ్య వేలల్లోనే ఉంటోంది. కొద్దికొద్దిగా కలుషితమవుతున్న గోదావరి క్రమంగా విషతుల్యంగా మారుతోంది.