వేతనమడిగేందుకు వెళ్తామంటే అడ్డగించి తీసేస్తామని అవమానించిన సూపర్ వైజర్లు

Share this:

పెండింగ్ వేతనాలు ఇచ్చి, సౌకర్యాలు కల్పించాలని క్యాజువాలిటీ ముందు స్కావేంజర్ల ఆందోళన
ఆర్ యం ఓ హామీతో ఆందోళన విరమించిన కార్మికులు

పేదలకు పెద్దదిక్కుగా ఉన్న పెద్దాస్పత్రిలో రోజువారి మలినాన్ని శుభ్రం చేస్తూ ఏ 1 ఏజెన్సీ క్రింద పనిచేస్తున్న స్కావెంజర్ కార్మికులు ఒకవైపు వేతనాలు రాక, మరోవైపు సూపర్ వైజర్ల వేధింపులతో నరకయాతన పడుతున్నారని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఆనంద్ బాబు, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి యం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం జిజిహెచ్ పారిశుద్ధ్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీతాల సమస్యపై అడిగేందుకు బయలుదేరిన స్కావేంజర్ మహిళా కార్మికులను జీతాలు అడిగితే తీసేస్తాం అంటూ అవమానించిన సూపర్వైజర్ దినేష్ రెడ్డి ని సస్పెండ్ చేసి, జీతాలు వెంటనే ఇవ్వాలని, ఆస్పత్రిలో పనిచేసేందుకు అవసరమైన పరికరాలు ఇవ్వాలని కోరుతూ.. స్కావెంజర్ ల డ్యూటీ హాజరు పాయింట్ వద్ద నుండి క్యాజువాలిటీ గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి, క్యాజువాలిటీ ముందు ధర్నా నిర్వహించారు. ధర్నా వద్దకు వచ్చిన ఏ వన్ ఏజెన్సీ సబ్ కాంట్రాక్టర్ శ్రీనివాస రెడ్డికి కార్మికులు తమ సమస్యలను వివరిస్తుండగానే శ్రీనివాస రెడ్డి తో పాటు వచ్చిన సూపర్వైజర్ దినేష్ రెడ్డి కలుగజేసుకుని జీతాలు అంటూ ఆందోళన చేస్తే తీసేసే.. తీరుతామని మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దానితో ఆగ్రహం చెందిన స్కావెంజర్ మహిళలు, మాతో పాటు జీతాలు తీసుకునే మీకు ఎందుకంత అహంకారమని, మాకు ఇవ్వాల్సిన పనిముట్లను అమ్ముకుని మీరేమైనా పంచుకుంటున్నారా అని సూపర్వైజర్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మానసికంగా వేదిస్తూ, చులకన భావంతో చూస్తే ఇక చూస్తూ ఊరుకోమని వారు తిరగబడ్డారు. స్కావెంజర్ ల ఆందోళన వద్దకు వచ్చిన ఆర్ ఎం ఓ శివప్రసాద్, కార్మికుల వినతిపత్రాన్ని తీసుకోవడంతోపాటు, వ్యక్తిగత అర్జీ ఇవ్వండి, మిమ్మల్ని మానసిక వేదనకు గురి చేసిన సూపర్వైజర్ దినేష్ రెడ్డిని తీసేస్తానని హామీ ఇచ్చారు. కార్మిక నాయకులతో మాట్లాడుతూ ప్రస్తుతం సూపరింటిండెంట్ లేరని, సూపరింటిండెంట్ వచ్చాక ఏజెన్సీ యాజమాన్యాన్ని, నాయకులను, వర్కర్లను కూర్చోబెట్టి సమస్యలపై మాట్లాడి పరిష్కరించుకుందాం అని హామీ ఇచ్చారు.

సి ఐ టి యు జిల్లా నాయకులు ఆర్ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు, సి ఐ టి యు నగర ప్రధాన కార్యదర్శి యం విజయ్, నగర కార్యదర్శివర్గ సభ్యులు కె రామకృష్ణ, స్కావెంజర్ వర్కర్స్ నాయకులు కళ్యాణ్, సుజాత, ప్రసాద్, లక్ష్మి పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత మార్చి నెలతో కలిపితే నాలుగు నెలలుగా జీతాలు రాక వర్కర్లంతా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆస్పత్రి అధికారులు జనవరి దాకా బిల్లును పూర్తిచేశామని చెబుతున్నా.. వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా ఎవరి జోబులో పెట్టుకుని తిరుగుతున్నారని వారు మండిపడ్డారు. ఆసుపత్రిని శుభ్రంగా ఉంచడంలో భాగంగా కార్మికులకు ఎలాంటి రక్షణ కవచాలు ఇవ్వకపోయినా.. ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వర్కర్లను నీచంగా చూస్తే ఇక సహించమన్నారు. అగ్రిమెంట్ ప్రకారం 16 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఎంత ఇస్తున్నారో అధికారులు తేల్చాలన్నారు. సంవత్సర కాలంగా రోస్టర్ మార్చకుండా ఆ బాధ్యత అధికారులపై వేసి తప్పించుకుంటున్నారన్నారు. సమస్యలపై వెంటనే కలుగజేసుకుని పరిష్కరించకపోతే నిరవధిక ఆందోళనకు వెళ్తామని వారు హెచ్చరించారు.

ఆందోళన కార్యక్రమంలో స్కావెంజర్ కార్మికులు సునీత, మల్లీశ్వరి,మహేష్, సురేష్, నాగలక్ష్మి, ఉరుకుందమ్మ, నాగమణి, వేనమ్మ, ఆశీర్వాదమ్మ, అంజనమ్మ,శ్వేతా, చిట్టెమ్మ, ఈశ్వరమ్మ, సరళ, లక్ష్మీ, మంగమ్మ, నాగరాజు, మోతురాజు, లింగన్న, నరసింహ,మేరమ్మ, ప్రభావతి, మద్దమ్మ, జయలక్ష్మి, సరోజమ్మ, వెంకటరమణమ్మ,శివ మరియు కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply