హనుమకొండ కలెక్టరేట్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి

Share this:

హనుమకొండ(V3News) 27-09-2022: భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో,నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అత్యంత చురుకుగా పాల్గొన్న మూడు తరాల ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధ్యక్షత వహించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో చీఫ్ విప్ మాట్లాడుతూ తొలిదశ,మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన కొనియాడారు. 1969వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అండగా దీక్షను చేయడమే కాకుండా తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి ఉద్యమానికి అండగా నిలిచిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేసుకున్నారు. నేటి హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆయన ఆనాడు జలదృశ్యం పేరుతో నివాసం ఏర్పాటు చేసుకుని ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జలదృశ్యంలోనే పురుడుపోసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఆ మహనీయుని ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరిట హర్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడమే కాకుండా త్వరలోనే ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని తెలిపారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఆ మహనీయుని పేరిట బీసీ సంక్షేమ భవనం మరియు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంఘాలు కోరుతున్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు బండ ప్రకాష్,జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్,కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్,జెడ్పి వైస్ ఛైర్మన్ శ్రీరాములు,అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ, బిసి వెల్ఫేర్ డిడి రాంరెడ్డి, శంకరయ్య, జిల్లా అధికారులు సిబ్బంది, పద్మశాలి సంఘం నాయకులు కలెక్టరేట్లో ఉన్న అన్ని కార్యాలయల సిబ్బంది పాల్గొన్నారు.