కంటి వెలుగు కార్యక్రమాన్నిప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గొల్లపేట కాలనీలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించడం తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1500 శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, నిర్మల్ నియోజకవర్గంలో 35 శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ పారుకి తో పాటు తదితరులు పాల్గొన్నారు.