పీకే స్క్రిప్టులో భాగంగానే వడ్ల కొనుగోలుపై టిఆర్ఎస్ రాజకీయం: డా.ఆర్.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Share this:

రామన్నపేట(V3News ): విభజన చట్టంలోని హామీల అమలుకై ఏనాడు పోరాటం చేయని టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు ఆకస్మాత్తుగా వడ్లు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై కొత్త రాజకీయ డ్రామాకు తెర తీశారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర 20 వ రోజు నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట మండలంలో శోభనాద్రిపురం,నిదానపల్లి, తుమ్మలగూడెం,రామన్నపేట, జనంపల్లిలో యాత్ర కొనసాగింది. జనం పల్లి గ్రామంలో గురుకుల పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా రామన్నపేట అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ​వందల కోట్లు పెట్టి ప్రశాంత్​ కిశోర్​తో ఒప్పందం కుదుర్చుకుని పీకే స్క్రిప్ట్ లో భాగంగానే వడ్ల కొనుగోలుపై తెరాస నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.కేసీఆర్ పాలన పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి కొత్త రాజకీయ డ్రామాలు మొదలు పెట్టాడని విమర్శించారు. విభజన చట్టంలోని ఇనుము ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్ల పెంపుపై కూడా తెరాస ఎంపీలు,మంత్రులు కేంద్రం మెడలు వంచి సాధించాలని పేర్కొన్నారు.కాళేశ్వరం,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.రామన్నపేట ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ఆయన రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల పోస్టులు ఖాళీలపై విస్మయం వ్యక్తం చేశారు. ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామన్నపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని గత్ కొన్నేళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. మూసీ సాగునీటి కాల్వ పిలాయిపల్లి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తానన్న కెసిఆర్ హామీ అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్రాన్ని పాలించడం చేతగాకపోతే వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎన్ని కుప్పిగంతులు వేసినా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని అన్నారు.తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలను పాతర వేసిన కేసీఆర్​ వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జిలు పుదరి సైదులు,పుదరి నర్సింహ,జిల్లా అధ్యక్షులు బొడ్డు కిరణ్,జిల్లా జిల్లా మహిళ కన్వీనర్ నర్రా నిర్మల,జిల్లా ఉపాధ్యక్షులు కోడి భీంప్రసాద్,నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి,నియోజకవర్గ మహిళ కన్వీనర్ మర్రి శోభ,నియోజకవర్గ అధ్యక్షులు కత్తులు కాన్షిరం, ప్రధాన కార్యదర్శి గద్దపాటి రమేష్,నియోజకవర్గ ట్రెసరరీ కళ్లెం వినయ్,నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి ముత్యాల రమేష్,మండల కన్వీనర్ మేడి సంతోష్,కో కన్వీనర్ నోముల చిరంజీవి, ప్రవీణ్ పావిరాల నర్సింహ,అన్ని గ్రామాల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply