పైసలు ఇస్తలేరని కట్ట తెంపిన్రు..! రాజురా వీడీసీ నిర్వాహాకం

Share this:

భైంసా : ఊరికి పైసలు ఇస్తేనే చేపలు పట్టనిస్తం.. లేదంటే చెరువు కట్టను తెంపి చేపలన్ని భూమి పాలు చేస్తం.. అని ఓ గ్రామ వీడీసీ గంగపుత్రులపై ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఇదీ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజురా గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజురా గ్రామంలో దాదాపు 35 గంగపుత్ర కుటుంబాలు ఉన్నాయి. వీరు కొన్నేళ్లుగా ఊర చెరువులో చేప పిల్లలను పెంచి పట్టుకుని విక్రయించేవారు. ఫిషరిష్ డిపార్టమెంట్కు పన్ను చెల్లించి చేపలు పెంచుతున్నారు. అయితే ఈ గ్రామ వీడీసీ గంగపుత్రులను పిలిపించి పైసలు ఇవ్వడంతో పాటు తాము నిర్ణయించిన ధరకే చేపలను విక్రయించాలని డిమాండ్ చేశారు. లేదంటే చెరువు కట్టను తెంపి చేపలను విడుదల చేస్తామని హెచ్చరించారు. సదరు గంగపుత్రులు ఎంతో కొంత చెల్లిస్తామని చెప్పిన వినలేదని, శనివారం వీడీసీ సభ్యులు కలిసి జేసీబీ సహాయంతో కట్టను తెంచారు. దీంతో అందులో నెలల తరబడి పెంచిన చేపలన్నీ బయటకు వెళ్లిపోవడంతో గంగపుత్రులు వీడీసీతో వాగ్వాదానికి దిగారు. ఎంతకీ వినకపోవడంతో లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.

Leave a Reply