గంజాయి సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దు
గంజాయి సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. గురువారం భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల అవగాహన, మరియు గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి భూపాలపల్లి పోలిసు స్టేషన్ ఆవరణలో ఎస్పీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ నిరహిస్తున్నామని, గంజాయి వినియోగదారులు, రవాణా దారులపై నిఘా పెట్టామని అన్నారు. గంజాయి రవాణా చేసే ముఠాలపై కఠిన చర్యలు తప్పవని, గంజాయి నియంత్రణకు జిల్లా టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని, జిల్లాకు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ లోని గడ్చిరోలి, చంద్రపూర్, బీజాపూర్ నుంచి గంజాయి రవాణా అయ్యే అవకాశం ఉందని, జిల్లా టాస్క్ఫోర్స్ టీం లు గంజాయి రవాణా దారులకు చెక్ పెడతాయని, పేర్కొన్నారు. పదే పదే నేరాలకు పాల్పడుతూ, గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే P.D యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పి కిరణ్ ఖరే హెచ్చరించారు. గంజాయి అక్రమరవాణాకు పాల్పడడం, మత్తుపదార్థాల వినియోగించే వారిని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ. సంపత్ రావు, భూపాలపల్లి సీఐ డి. నరేష్ కుమార్, చిట్యాల సిఐ డి. మల్లేష్, ఎస్సైలు సుధాకర్, సాంబమూర్తి, రవికుమార్, అశోక్, ప్రసాద్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.